Friday, March 8, 2013

శ్రీ ముందరపొట్టెమ్మ కథ / Story of Mundara pottemma located near Puvvaladoruvu village.

ఓం
Narrated by :- Sri Nuvusetty Venkataramanayya, Puvvaladoruvu.
చెప్పినవారు : శ్రీ వెంకట రమణయ్య, పువ్వలదొరువు.

మహాతల్లి ముందరపొట్టెమ్మ తల్లి చరిత్రను తెల్సినవరకు వ్రాయడమైనది. ముందరపొట్టెమ్మ తల్లి భారతదేశము, ఆంధ్రపదేశ్, నెల్లూరు జిల్లాయందు గల కావలి మండలమునందు తాళ్ళపాళెం అను పంచాయితి గ్రామము కలదు. ఆ పంచాయితిలో ఎక్కువ పేద గ్రామాలు కొన్ని ఉండేవి. కాని ఈ తాళ్ళపాళెంలో ధనికులైన రెడ్ల కుటుంబములు చాలా ఉండినవి. మన దేశమును పాలించిన బ్రిటిష్ వారికి ముందు నవాబులు పరిపాలించినట్లు పెద్దలు చెపుతూ ఉంటారు. ఆ నవాబులు పాలించే రోజులలో శ్రీ ముందరపొట్టెమ్మ తల్లి తాళ్ళపాళెం గ్రామములో రెడ్ల కుటుంబము అయిన సామంతుల వారి ఇంటి యందు జన్మించినది. పల్ల్లె గ్రామములు పురాతనము నుండి గూడా బుంగలతో (కడవలు) నీళ్ళు గుంటలనుండి మోసుకొని వచ్చి రాగి పైరుకు (చోళ్ళు) నీళ్ళు చల్లి రాగులును పండించటము అలవాటు. ఈ పద్ధతి ఇప్పటికీ ఉన్నది. అప్పటి రైతులు అలా పండించిన ధాన్యము, రాగులు మరియు ఇతరత్రా పండించిన పంటలను గాదెలలో పోసుకొని ఉంచేవారు. అప్పటిలో గాదె అంటే వరిపొట్టు, బంకమట్టిని కలిపిన మిశ్రమముతో పెద్దపెద్ద బానలు తయారు చేసి వాటిని మంటల ద్వారా కాల్చిన అవి గట్టి పడును. అప్పుడు వాటియందు పండించిన పంటలను నిల్వ చేసుకొనేవారు.

         ఈ సామంతులవారు గూడా ఈ గాదెలో రాగులు పోయించి ఉండినారు. ఈ గాదెనుండి వాడుకొనుటకు రాగులు ప్రతినిత్యము తీసుకుంటూ ఉండినారు. కాని వారు ఒక వింతని గమనించకుండా తీస్తూనే వాడుకంటూ ఉన్నారు. ఒక రెండు మూడు నెలలు అయిన గాని గాదె నిండి ఉన్నది. అప్పుడు వారికి ఆలోచనకు వచ్చి అనుమానంలో పడి గ్రామములొ అందరికి తెలియజేసినారు. కాని గ్రామస్తులు వారి మాటలు నమ్మకుండా వారిని తూలనాడినారట. ఓదినము కూతలకు రాగులు ఇచ్చుటకు సామంతులవారు మరలా నిండియున్న గాదెలోని సగం రాగులు క్రిందపోసి కూలీలకు ఇచ్చినారు. కాని గాదె మాత్రము మరలా పూర్తి అయినది. అప్పుడు ఆ ఇంటివారు గ్రామ పెద్దలకు ఇప్పుడు జరిగిన విషయం చెప్పగా వారు వచ్చి గాదెలొని రాగులు కొన్ని క్రిందపోయించగా వారి ఎదుటే మరలా పూర్తి అయినదట. అంతట వారు మూర్ఖంగా గాదెను దొర్లంచినారు.  అప్పుడు ఆ గాదె నుండి ఒక అడుగు రాతి విగ్రహము ఉన్నదట. అంతట అందరు ఆలోచనలో పడి ఏమిట చిత్రము అని అనుకుంటూ ఉండగా ఆ ప్రదేశములోనే ఉండిఉన్న ఒక ముసలామెకు వంటిలోకి ప్రవేశించి నేను ముందర పొట్టెమ్మను, నేను మీ ఇంట పుట్టేను. మీరు నా పుట్టింటివారు, నేను మీకు ఎలాంటి ఆపదలూ రానివ్వను. మిమ్ములనేను కాచి ఉంటాను. నాకు ఇక్కడే గుడి కట్టించండి అని వెప్పి వెళ్ళిండంట. అంతట గ్రామ పెద్దలు ఇంకా ఇతరులు ఇంటిలో వద్దు మన ఊరికి దక్షిణంగా తూర్పున పూరిగుడిశె ఎర్పాటు చేసి అక్కడ ప్రతిష్ట చేయిస్తాము అని తీర్మానించినారట.  అందుకు అందరు ఏకమై ముహూర్తం నిర్ణయించి, ఊరంతా మేళతాళాలతోటి పొంగళ్ళకు సిద్ధపడి అందరూ ఆ గ్రామస్థులు నిర్ణయించిన స్థలం వద్దకు వెల్లినారట. అంతట ఆ ముందరపొట్టెమ్మ తల్లి అక్కడ మరివకరికి వంట్లోకి ప్రవేశించి నాకు ఇక్కడ గుడి ఏర్పాటు చేయవద్దు, నాకు రోకలిపోటు, కోడి కూత వినిపించని స్థలంలో  ఉంచండి అని చెప్పినదట. అంతట ఆ స్థలం మీరె చూపించండి అని పెద్దలు అడుగగా అంతట ఆ తల్లి ఈ అడవికి తూర్పున చెరువు ఉన్నది ఆ చెరువుకి పరమటి భాగంలో నా గుడి ఏర్పాటు చేసి, అక్కడ ప్రతిష్టించండి అని చెప్పినదట.
               అప్పుడు పెద్దలందరు అమ్మవారు చెప్పిన దిశగ వెల్లి అడివికి తూర్పున చెరువు, పరమట కొద్దిపాటి ఎత్తుగా ఉన్న ప్రదేశంలో గుడి ఏర్పాటు చేసి మరలా ముహూర్తం నిర్ణయించి మంగల మేళాలతో బండ్లు కట్టుకొని, ఊరి వారంతా పొంగళ్ళు పెట్టించి, సామంతులవారి ద్వారా పసుపు, కుంకుమ, చీర, రవిక, మొదటి బెల్లము మరియు వారిచే పొంగళ్ళు పెట్టించి అమ్మవారిని అక్కడ ప్రతిష్ట చేసినారు. అంటే ప్రస్థుతం అమ్మవారు ఉన్న గుడి ఇదే.
               ముందరపొట్టెమ్మ పుట్టినది తాళ్ళపాళెం పంచాయితిలో, స్థిర నివాసం ఏర్పరుచుకున్నది తుమ్మలపెంట పంచాయితిలో. కాని తుమ్మలపెంట పంచాయితీని షుమారు 50 సంవత్సరాల క్రిందట ముక్కలు చేసి అన్నగారిపాలెం పంచాయితీని ఏర్పరిచినారు. ప్రస్థుతం శ్రీ ముందరపొట్టెమ్మ దేవాలయము ఈ అన్నగారిపాళెం పంచాయితి పరిథిలో ఉన్నది. ప్రతిష్ట జరిగినప్పటినుండి, తాళ్ళపాళెం వారు అనగా సామంతులవారు ప్రతి ఆదివారము వచ్చి అమ్మవార్కి పూజలు గరిపి, పొంగలి నైవేద్యము పెట్టి పోతూ ఉండేవారట.   

               ఈ ప్రకారము కొన్ని సంవత్సరములు తాళ్ళం వారే పూజలు జరుపుతూ ఉండినారట. అచ్చటకు పూజా సమయంలో పశువుల కాపర్లు ఇంకా ఇతరులు ఫలహారాల కొరకు వెళ్ళేవారు. వారితో సామంతులవారు మీలో ఎవరైనా అమ్మవారికి పూజలు జరుపుతారా? అని అడుగగ, సమీపములో ఉన్న మామిళ్ళదొరువు గ్రామ కాపురస్థుడు ఒకరు "నేను పూజలు చేస్తానయ్యా!" అని చెప్పినాడట. ఆయన పేరు ఎవ్వరికీ తెలియదు. కాని వారి ఇంటిపేరు మాత్రం రాజు. ఈ రాజు వంశీయులే అప్పటి నుండి ఇప్పటి వరకు పూజలు జరుపుతూనే ఉన్నారు.   

Will continue........www.google.co.in

No comments:

Post a Comment